: బంగారు బోనమెత్తిన పీవీ సింధు!
లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బంగారు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, ప్రతి ఏటా బంగారు బోనం సమర్పిస్తుంటానని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నానని చెప్పింది. ఈ సందర్భంగా ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పింది. గతంలో ఒలింపిక్స్ జరగడానికి ముందు ఓసారి ఇక్కడికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంది. కాగా, లాల్ దర్వాజ అమ్మవారిని బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ప్రముఖుల తాకిడి కూడా బాగా ఉండటంతో భద్రతను మరింత పెంచారు.