: మంత్రి పదవి వస్తుందంటే నమ్మి రూ. 57 లక్షలు సమర్పించుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే!


ప్రత్యేక పూజలు చేస్తే, మంత్రి పదవి వస్తుందని కోయదొరలు చెబితే, నమ్మి వారికి రూ. 57 లక్షలు సమర్పించుకున్నారో ఎమ్మెల్యే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కలిసిన కోయదొరల వేషంలోని వ్యక్తులు, పూజలు చేస్తే, పదవులు వస్తాయని నమ్మబలికారు. డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో మోసపోయామని తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే, పోలీసులను ఆశ్రయించగా, వారు రహస్యంగా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. నిందితులు చిక్కిన తరువాతనే వివరాలు బయటపెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

వరంగల్ సమీపంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతంలో ఎంతో మంది కోయదొరలు ఉండటంతో, వారందరినీ విచారించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని, తన బంధువులతో మౌఖిక ఫిర్యాదు ఇప్పించారని సమాచారం. ఇక, ఎమ్మెల్యే ఇంట్లోని సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, ఇదే తరహాలో కోయదొరల వేషం వేసుకుని వచ్చిన వారి మాటలను నమ్మి మరికొందరు ప్రముఖులు కూడా మోస పోయారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని వీరు భావిస్తున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News