: 'పోలీసులూ... మమ్మల్ని జైలుకు పంపొద్దు': టెక్సాస్ లో బతిమాలుకున్న ఇద్దరు చిన్నారులు
ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... ఏకంగా 25 సార్లు పోలీసులకు తప్పుడు ఫోన్ కాల్స్ చేసి, వారిని తప్పుదారి పట్టించిన ఇద్దరు చిన్నారులకు బుద్ధి వచ్చింది. వారిపై చర్యలకు దిగే సమయంలో ఇద్దరు బుడతలూ, తమను క్షమించాలని, ఇదే ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని, జైలుకు పంపొద్దని వేడుకుంటూ, తమ చేతులతో స్వయంగా లేఖలు రాశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఫన్నీగా తీసుకున్న పోలీసులు, తమ అధికార ఫేస్ బుక్ పేజీలో ఆ లేఖలను ఉంచారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకుంటున్న వీరిద్దరూ, పోలీసులకు ఫోన్ చేయడం, ఓ తప్పుడు అడ్రస్ చెప్పడాన్ని తమాషాగా తీసుకున్నారు. రాత్రి పూట నిద్రరాక వారు ఈ పని చేయడం ప్రారంభించారు. విషయం బయటపడిన తరువాత, పోలీసు శాఖకు క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. 25 సార్లు తాను ఫోన్ చేయడానికి కారణం వెనుక ఆనందం ఉందని చెప్పాడు. అన్ని సార్లు కాల్ చేసినందుకు క్షమించాలని, తన జీవితంలో మరోసారి ఇలా చేయబోనని, జైలుకు పంపొద్దని వేడుకున్నారు. ఈ లేఖలోని నిజాయతీని గమనించిన పోలీసు అధికారులు, వీరు స్పెల్లింగ్ తప్పులు, గ్రామర్ తప్పులూ లేకుండా లేఖను రాశారని చెబుతూ, వాటిని ఫేస్ బుక్ లో ఉంచగా, అవి వైరల్ అయ్యాయి.