: గోవును చంపితే 14 ఏళ్ల జైలు.. మనిషిని చంపితే మాత్రం రెండేళ్లు.. హిట్ అండ్ రన్ కేసులో న్యాయస్థానం తీర్పు.. విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు!
2008లో బీఎండబ్ల్యూ కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనదారుడి మృతికి కారణమైన హరియాణాకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. జడ్జి ఇచ్చిన ఈ తీర్పు న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గోవును చంపిన నేరానికి వివిధ రాష్ట్రాల్లో కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న వారికి మాత్రం నామమాత్రపు శిక్షలు విధించి వదిలేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజా కేసులో 30 ఏళ్ల ఉత్సవ్ భాసిన్ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి రెండేళ్ల శిక్ష విధించడంతోపాటు మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు, క్షతగాత్రుడికి రూ.2 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబరు 11, 2008లో బీబీఏ విద్యార్థి అయిన భాసిన్ దక్షిణ ఢిల్లీలో బీఎండబ్ల్యూ కారులో వెళ్తూ అనూజ్ చౌహాన్, అతడి స్నేహితుడు మృగాంక్ శ్రీవాస్తవను ఢీకొట్టాడు. ఈ ఘటనలో చౌహాన్ చనిపోగా శ్రీవాస్తవ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. చండీగఢ్ పారిపోతున్న భాసిన్ను ఐఎస్బీటీ కశ్మీరీ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మేలోనే కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్షాకాలాన్ని మాత్రం శనివారం ప్రకటించింది. అంతేకాదు, దోషికి కొన్ని షరతులతో బెయిలు కూడా మంజూరు చేసింది. కాగా, అతడికి తక్కువలో తక్కువగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని భావించారు. అయితే కోర్టు తీర్పు పలువురిని విస్మయ పరిచింది.