: ఆ 12 మంది సినీ ప్రముఖులని అరెస్టు చేసే అంశంపై ఇప్పుడేం చెప్పలేం: అకున్ సబర్వాల్
తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారం అంశంపై ఈ రోజు సాయంత్రం ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మరిన్ని వివరాలు తెలిపారు. ఇప్పటివరకు తాము అధికారికంగా ఎవ్వరి పేర్లనూ వెల్లడించలేదని మరోసారి స్పష్టం చేశారు. మొత్తం 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపాలని అనుకున్నామని, కానీ 12 మందికి మాత్రమే నోటీసులు వెళ్లాయని చెప్పారు. అడ్రస్ సరిగా లేకపోవడం వలన మరో ఇద్దరికి నోటీసులు అందే విషయంలో ఆలస్యం జరిగిందని చెప్పారు. మొదట ఆ 12 మందిని విచారించనున్నట్లు చెప్పారు. వారిని విచారించాల్సి ఉందని, వారిని అరెస్టు చేసే అంశంపై ఇప్పుడేం చెప్పలేమని తెలిపారు.
ఈ కేసులో తమపై ఎవరి ఒత్తిడీ లేదని సబర్వాల్ అన్నారు. డ్రగ్స్ కేసులో వేగంగా విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు. తాను ఎల్లుండి నుంచి సెలవుపై వెళుతున్నానని, అయినప్పటికీ ఈ కేసుకి వచ్చిన నష్టం ఎమీ లేదని, ఈ కేసు నీరుగారదని అన్నారు. తన టీమ్‌లో ఎంతో మంది సమర్థవంతమైన వారు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో తనతో పాటు వారు అందరూ పాలుపంచుకున్నారని తెలిపారు. జూన్‌లోనే తాను సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నానని అన్నారు. నార్త్ ఇండియా వెళుతున్నానని చెప్పారు. అక్కడి నుంచి కూడా ఈ కేసును పరిశీలిస్తూనే ఉంటానని తెలిపారు. గవర్నమెంట్ ఇప్పటికే లీవ్ ఇచ్చేసిందని అన్నారు.
విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్న అంశంపై స్పందించిన సబర్వాల్.. విద్యాసంస్థలు కౌన్సెలింగ్ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. విద్యా సంస్థలకు వెళ్లి తాము కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పలువురు ఈ డ్రగ్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేసుకుంటున్నారని, కొన్ని వెబ్‌సైట్లను గుర్తించామని అన్నారు. ఈ కేసు విచారణలో ప్రభుత్వ మద్దతు 100 శాతం ఉందని చెప్పారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా ఎల్ఎస్‌డీ యూనిట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అదుపులోకి తీసుకుంటామని అకున్ సబర్వాల్ తెలిపారు.