: గతంలో డ్రగ్స్ కు బానిసనై చాలా దెబ్బతిన్నాను: గతాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖ సినీ నటుడు భానుచందర్
ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ డ్రగ్స్ కు బానిసలవడం తనకు నచ్చలేదని, చాలా బాధాకరమైన విషయమని ప్రముఖ సీనియర్ నటుడు భానుచందర్ అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కు బానిసలైన విషయమై మీడియా ప్రశ్నించగా భానుచందర్ మాట్లాడుతూ, గతంలో డ్రగ్స్ కు బానిసను అయిన తాను, చాలా దెబ్బతిన్నానని చెప్పారు. అప్పటికి తనకు ఇంకా పెళ్లి కాలేదని, డ్రగ్స్ మత్తులో పడిపోయానని, అయితే.. దాని నుంచి బయటపడేందుకు మార్షల్ ఆర్ట్స్, తన అన్నయ్య ఇచ్చిన స్ఫూర్తి తనకు ఎంతగానో దోహదపడ్డాయని చెప్పారు.
మార్షల్ ఆర్ట్స్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తాను, కెరీర్ పై దృష్టి పెట్టిన తాను, ఈ రోజు సినీ ఇండస్ట్రీలో ఓ పేరు సంపాదించుకున్నానని చెప్పారు. ‘యువతను రిక్వెస్ట్ చేస్తున్నాను, డ్రగ్స్ జోలికి వెళ్లకండి. క్రమశిక్షణతో ఉంటే మనకు కావాల్సినవన్నీ అవే వస్తాయి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ వస్తుంది. వయసుతో పనిలేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా జీవితంలో మంచి మార్పు రావడం ఖాయం’ అని భానుచందర్ అన్నారు.