: రెహమాన్ లండన్ కాన్సర్ట్ లో తమిళ పాటలే ఎక్కువగా ఉండడంపై అభిమానుల ఆగ్రహం!
ఆస్కార్ విజేత, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇలా చేస్తాడా? అంటూ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ లండన్‌లో వెంబ్లీ స్టేడియంలో ఆయన ఇచ్చిన ప్రదర్శనే కారణం. రెహమాన్ లైవ్ కాన్సర్ట్ అనగానే ఎంత డబ్బు పెట్టి వెళ్లడానికైనా ఎన్నారై అభిమానులు వెనకాడరు. అలాంటి అభిమానులే ఇప్పుడు `కాన్సర్ట్‌కి వెళ్లి తప్పు చేశాం. మా డబ్బులు మాకు తిరిగేచ్చేయండి` అంటూ గొడవ చేస్తున్నారు.
ప్రదర్శనలో రెహమాన్ ఎక్కువగా తమిళ పాటలే పాడటంతో ఉత్తర భారత ఎన్నారై అభిమానులు నిరాశ చెందారు. కాన్సర్ట్ జరుగుతుండగానే వాళ్లందరూ స్టేడియం నుంచి బయటకి వచ్చేశారు. ఇంటికి వచ్చాక సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఈ కాన్సర్ట్ పేరే `నేత్రు... ఇండ్రు.. నాలాయ్`. అందుకే ఎక్కువగా తమిళ పాటలు పాడారని, అయినా సంగీతానికి భాషతో సంబంధమేంటని రెహమాన్ వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పటికీ అభిమానుల పరిస్థితి అర్థమై మధ్యమధ్యలో కొన్ని హిందీ పాటలు కూడా రెహమాన్ పాడారని ఈవెంట్ నిర్వాహకులు చెప్పారు.