: బెంగళూరు స్టార్టప్ కంపెనీని చేజిక్కించుకున్న గూగుల్!
తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్ధిలో భాగంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్, బెంగళూరుకు చెందిన హళ్లి ల్యాబ్స్‌ను సొంతం చేసుకుంది. కంపెనీ ప్రారంభించి 4 నెలలు కూడా గడవకముందే గూగుల్ దీన్ని కొనేయడంతో హళ్లి ల్యాబ్స్ సీఈఓ పంకజ్ గుప్త ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లాంగ్వేజ్ డొమైన్లపై పనిచేసే ఈ కంపెనీ గూగుల్ వారి ఏఐ బృందంలో భాగమైందని పంకజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కానీ ఎంత మొత్తానికి అనే సంగతి చెప్పలేదు.
ఐఐటీ ఢిల్లీలో చదువుకున్న పంకజ్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. గూగుల్ ఏఐ విస్తరణలో భాగంగా స్వాధీనం చేసుకున్న నాలుగో కంపెనీ హళ్లి ల్యాబ్స్. ఇంతకు ముందు లండన్‌కు చెందిన డీప్‌మైండ్ టెక్నాలజీస్, డార్క్‌బ్లూ ల్యాబ్స్, అమెరికాకు చెందిన జెట్పాక్లను గూగుల్ చేజిక్కించుకుంది. ఈ క్రమంలో గూగుల్ సొంతం చేసుకున్న ఏకైక భారత కంపెనీ హళ్లి ల్యాబ్స్.