: గాంధీ పెన్సిల్ స్కెచ్‌ను రూ. 27 లక్షలతో కొన్న భారత పారిశ్రామికవేత్త
పెన్సిల్‌తో వేసిన జాతిపిత మహాత్మ గాంధీ బొమ్మను రూ. 27 లక్షలతో వేలంలో కొనుక్కుని తనకు గాంధీ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారో భారతీయ పారిశ్రామికవేత్త. పూణేకు చెందిన పూనావాలా గ్రూప్ అధినేత సైరస్ పూనావాలా లండన్‌లో జరిగిన సూథ్‌బై వేలంలో ఈ బొమ్మను దక్కించుకున్నారు.
1931లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినపుడు ఈ పెన్సిల్ స్కెచ్ వేశారు. దీని మీద గాంధీజీ తన సంతకం చేసి, తేదీ కూడా వేశారు. ఈ వేలంలో గాంధీజీ బొమ్మకు రూ. 6 నుంచి రూ. 10 లక్షల వరకు పలుకుతుందని సూథ్‌బై వారు భావించారు. కానీ రూ. 27 లక్షలతో సైరస్ పాటపాడి ఆ పటాన్ని గెల్చుకోవడంతో వారు ఆశ్చర్యపోయారు.
`గాంధీజీ అంటే నాకు చాలా గౌరవం. ఎంత ఖర్చుపెట్టైనా సరే ఈ పెన్సిల్ స్కెచ్ దక్కించుకోవాలనుకున్నా. అవసరమైతే మరికొంత డబ్బు చెల్లించడానికైనా నేను సిద్ధం` అంటూ తన గౌరవాన్ని చాటుకున్నారు సైరస్. ఈ పటాన్ని లండన్‌కు చెందిన జాన్ హెన్రీ ఆమ్షేవిట్జ్ గీశారు. ఈ పటాన్ని హడాప్సార్లోని తన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉంచుతానని సైరస్ చెప్పారు.