: నేను వైసీపీలో చేరడం లేదు: సినీ నటుడు శివాజీ
ప్రముఖ సినీ నటుడు శివాజీ వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న శివాజీని చేర్చుకుంటే వైసీపీకి లాభం ఉంటుందని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. ఈ వార్తలపై తాజాగా శివాజీ స్పందించారు.
గతంలో తాను జనసేనలోకి వెళ్తున్నట్టు, ఇప్పుడేమో వైసీపీలోకి వెళ్తున్నట్టు రకరకాలుగా ప్రచారం చేశారని... వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని... త్వరలోనే సినిమాను అనౌన్స్ చేస్తానని చెప్పారు. పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిగా, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిగా తనను ప్రజలు చీదరించుకోవాలని తాను కోరుకోవడం లేదని తెలిపారు.