: వారిని విచారించడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు... సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి: సురేష్ బాబు
డ్రగ్స్ వినియోగం లేదా సరఫరాతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులను విచారించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని అన్నారు. ఎవరైనా హద్దులు మీరితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సమాజానికి ఎవరూ ఇబ్బందిగా మారకూడదని ఆయన చెప్పారు.
సినీ పరిశ్రమలోని వ్యక్తులు సమాజంపై చెడు ప్రభావం చూపకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ మూలాలు కట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని, వారు తీసుకునే ఎలాంటి చర్యలకైనా సహకరించేందుకు తెలుగు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా చిత్రపరిశ్రమ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.