: సదావర్తి భూముల కోసం... ఏపీ సర్కారుకు రూ. 10 కోట్లు చెల్లించిన వైకాపా ఎమ్మెల్యే ఆర్కే!
సదావర్తి భూముల విషయమై హైకోర్టు సూచించిన విధంగా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ. 10 కోట్లను చెల్లించారు. దేవాదాయ శాఖ కమిషనర్ కు డబ్బులు చెల్లించిన ఆర్కే, ఆ వివరాలను కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు అందించారు. కొంత సమయం ఇస్తే, మిగతా 17 కోట్ల రూపాయలను కూడా చెల్లించగలమని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, ఈ కేసు తదుపరి వాదనలను హైకోర్టు 17వ తేదీన విననుంది. కాగా, వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం రూ. 22 కోట్లకే అప్పనంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిందని ఆర్కే కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. కేసును విచారించిన న్యాయస్థానం, అదనంగా రూ. 5 కోట్లను చెల్లించి ఆ భూములను తీసుకుంటారా? అని అడుగగా ఆర్కే సరేనని చెప్పడంతో, పది రోజుల గడువును ఇచ్చింది. పది రోజులు పూర్తి కాకుండానే, తాను డబ్బు కట్టినట్టు ఆర్కే కోర్టుకు వెల్లడించడం గమనార్హం.