: జీఎస్టీ విధింపుకు నిరసన: ఆర్థిక మంత్రికి శానిటరీ నాప్కిన్లు పంపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థినులు!
జీఎస్టీ విధానంలో భాగంగా శానిటరీ నాప్కిన్లపై 12 శాతం పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి చెందిన వివిధ విద్యార్థి సంఘాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి శానిటరీ నాప్కిన్లపై నినాదాలు రాసి పంపించాయి. ఈ విషయంపై మామూలుగా కూడా నిరసన తెలిపి ఉండొచ్చని, కాకపోతే ఇలా తెలపడం వల్ల సమస్యకు త్వరగా పరిష్కారం లభించే అవకాశాలున్నాయని విద్యార్థినులు అభిప్రాయపడుతున్నారు. వీరికి ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ కూడా మద్ధతు తెలిపింది.
పన్ను నుంచి మినహాయించే వరకు ఇలా శానిటరీ నాప్కిన్లు పంపిస్తూనే ఉంటామని వారు తెలిపారు. `బొట్టు, గాజులపై ఎలాంటి సుంకం లేదు. అలాగే కండోమ్‌లు, గర్భనిరోధక వస్తువులపై కూడా ఎలాంటి సుంకం లేదు. మరి దేశంలో 50 శాతం మంది తప్పనిసరిగా ఉపయోగించే శానిటరీ నాప్కిన్లపై సుంకం ఎందుకు?` అంటూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని అనురాధా కుమారి ప్రశ్నించారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ ముఖర్జీ మాట్లాడుతూ - `శానిటరీ నాప్కిన్లను లగ్జరీ వస్తువుగా భావించి ప్రభుత్వం 12 శాతం జీఎస్టీ విధించింది. నిజానికి ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోతే ఎలా? ఉత్తర భారతదేశంలో 35 శాతం మంది ఆడపిల్లలు తాము రజస్వల అయిన తర్వాత ఆరోగ్య శుభ్రత పాటించలేక పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు. ఇలాంటి సమస్యల మధ్య శానిటరీ నాప్కిన్లపై పన్ను విధించడం భావ్యం కాదు` అన్నారు.