: గ్రీటింగ్స్ ఒకరికి.. ఫోటో మరొకరిది!: ట్విట్టర్ లో కోహ్లీ పొరపాటు
టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఈ మధ్య కాలంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. తాజాగా ట్విట్టర్లో అతను చేసిన ఓ పొరపాటు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో 6 వేల పరుగులు చేసి, ప్రపంచంలో ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్ ఉమన్ గా రికార్డు పుటల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా ఎంతో మంది ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
ఆ క్రమంలో కోహ్లీ కూడా ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అయితే, మిథాలీ రాజ్ ఫొటోను కాకుండా పొరపాటున మరో క్రికెటర్ పూనమ్ రౌత్ ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఆ తప్పును కోహ్లీ గ్రహించలేకపోయాడు. అభిమానులు ఈ తప్పిందంపై స్పందిస్తున్నప్పటికీ కోహ్లీ దాన్ని గుర్తించలేదు. చాలా సేపటి వరకు ఆ ఫొటో అలానే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ పోస్ట్ మొత్తాన్ని కోహ్లీ తొలగించాడు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఎవరో కూడా కోహ్లీకి తెలవదా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.