: జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి... పట్టించుకునేవారేరి?
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నేరాల కారణంగా జైలు జీవితం గడపాల్సిన ఖైదీల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కానీ జైళ్ల సంఖ్య మాత్రం అలాగే ఉంది. దీంతో ఉండవలసిన ఖైదీల సంఖ్య కంటే ఎక్కువ మందిని జైళ్లలో కుక్కేస్తున్నారు అధికారులు. లెక్కప్రకారం ఒక్కో ఖైదీకి పడుకోవడానికి 40 చదరపు అడుగుల స్థలాన్ని సమకూర్చాలి. కానీ ప్రస్తుతం ఒక్కో ఖైదీకి కేవలం 12 చదరపు అడుగుల స్థలాన్ని మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. అంటే ఒక్కరు పడుకోవాల్సిన స్థలాన్ని ముగ్గురికి సర్దుతున్నారన్నమాట.
ప్రాంతీయ కారాగారాల కంటే ప్రధాన పట్టణాల్లో ఉండే జైళ్లు ఈ అధిక ఖైదీల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ జైళ్లలో ముఖ్యంగా విచారణ కోసం ఎదురుచూస్తున్న ఖైదీలే ఎక్కువ మంది ఉండటం ఇందుకు ప్రధాన కారణం. సత్వర న్యాయం జరగకపోవడం, కేసు విచారణలో జాప్యం, బెయిల్ మంజూరు కాకపోవడం వంటి కారణాల వల్ల జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు చాలా మందే ఉన్నారు.
ఇక ఇంత మంది ఖైదీలు ఉన్నపుడు కనీస సౌకర్యాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. జైళ్లో ఆహారం సరిగా ఉండట్లేదనే మచ్చ ఎప్పట్నుంచో ఉంది. ఇక టాయ్లెట్ల సంగతి మరీ అధ్వానం. ముంబైలోని ఓ జైళ్లో టాయ్లెట్ ముందు ఏ సమయంలో చూసినా కనీసం 30 మంది లైన్లో ఉంటారని అక్కడి ఖైదీలు చెబుతున్నారు. లెక్కప్రకారం ఖైదీలకు అందవలసిన సౌకర్యాల్లో కనీసం 30 శాతం కూడా అందుబాటులో లేవని వారు వాపోతున్నారు. ఇక్కడే కాకుండా మహిళా జైళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త జైళ్లను నిర్మించడం లేదా కేసు విచారణలు త్వరగా పూర్తి చేయడం తప్ప వేరే మార్గాలు లేవని విశ్లేషకుల అభిప్రాయం.