: చంద్రబాబు, కేసీఆర్ కోరికకు రాహుల్ గాంధీ అడ్డంకి!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబునాయుడు, కే చంద్రశేఖరరావులు గట్టిగా కోరుకుంటున్న ఓ కోరిక నెరవేరకుండా చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సీట్లను పెంచుకోవడం ద్వారా తమను నమ్ముకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను ఆదుకోవాలని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ భావిస్తున్నారు. సీట్ల సంఖ్య పెరగకుంటే, దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న వారికి నష్టం జరుగుతుందని, అది విపక్షాలకు ప్లస్ పాయింట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం సుముఖంగా ఉందని, కేబినెట్ నోట్ ను, బిల్లును సిద్ధం చేసిన కేంద్ర హోం శాఖ పీఎంఓ ఆదేశాల కోసం ఎదురు చూస్తోందని వార్తలు వచ్చాయి.
ఇక సీట్ల పెంపు కూడదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విన్నవించడంతో, సీట్ల పెంపు బిల్లుపై, దాన్ని ఎలా అడ్డుకోవాలన్న విషయమై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. వాస్తవానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో సీట్ల పెంపు అంశాన్ని చేర్చలేదు. పరిశీలించాలని మాత్రమే ఉంది. ఇక అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ తదితర అంశాలను కూడా పరిశీలించాలని ఉంది. ఇప్పుడదే కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ కానుంది. హోదా, రైల్వే జోన్ అంశాలను పక్కనబెట్టి, అసెంబ్లీల పెంపును మాత్రమే పరిశీలిస్తామంటే, తాము అంగీకరించబోమని కాంగ్రెస్ సహా మిగతా యూపీఏ భాగస్వామ్యాలు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలోని బీజేపీ నేతలు సైతం సీట్లను పెంచే విషయంలో విముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్, కేరళ సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తుండటంతో, ఆయా రాష్ట్రాలు కూడా ఈ బిల్లును అడ్డుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక కేంద్రం ముందడుగు వేసి ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చిన పక్షంలో, పూర్తి బలమున్న లోక్ సభలో బిల్లుకు పెద్దగా అడ్డంకులు ఉండబోవు. ఇక కాంగ్రెస్ తో పోలిస్తే, తక్కువ బలమున్న బీజేపీకి రాజ్యసభలోనే చుక్కెదురయ్యే అవకాశాలు ఉన్నాయి. యూపీఏ నిలిపిన రాష్ట్రపతి అభ్యర్థిని మీరా కుమార్ కు మద్దతిస్తున్న 17 పార్టీలనూ ఒప్పించగలిగితే, ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోతుందని రఘువీరా చెప్పిన మాటలకు రాహుల్ కూడా అంగీకరించారని తెలుస్తోంది. రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించడం ద్వారా సీట్లను సులువుగా పెంచుకోవచ్చని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెబుతుండగా, అదే తరహా సవరణలు చేసి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కూడా కావాలంటూ విపక్షాలు రాద్ధాంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.