: తమ ఎమ్మెల్యేలు కూడా చనిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు!: టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తమ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని, అందుకే తమ ఎమ్మెల్యేలు కూడా చనిపోవాలని వారు కోరుకుంటున్నారని వైసీపీ టికెట్ పై గెలిచి, ఆపై టీడీపీలో చేరిన కర్నూలు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమా నాగిరెడ్డికి స్వయానా బావ అయిన మోహన్ రెడ్డి, నంద్యాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేళ, ఉప ఎన్నికలు రావడంతోనే నంద్యాల నేతలకు పదవుల పంట పండిందని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.
ఇక్కడ జరుగుతున్న పనులు చూసి, పక్క అసెంబ్లీల సెగ్మెంట్ల ప్రజలు సైతం తమ ఎమ్మెల్యేలు పోవాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎస్వీ ప్రసంగిస్తున్న వేదికపైనే ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఉండటం గమనార్హం. కాగా, గడచిన పది రోజుల్లో నంద్యాల అభివృద్ధి నిమిత్తం రూ. 300 కోట్ల విలువైన పథకాలను ప్రవేశపెట్టింది. కాపు కల్యాణ మండపం నుంచి కొత్త రోడ్ల వరకూ ఎన్నో పనులు జరుగుతుండగా, గత మూడేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం, ఉప ఎన్నికలు దగ్గరైన నేపథ్యంలో ఇటువంటి పనులు చేపట్టిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.