: ద్రవిడ్ పై నోరు పారేసుకుని.. అతడంటే గౌరవమట
క్రికెటర్ గౌతం గంభీర్ కు ముక్కుమీద కోపం ఎక్కువైపోయింది. మ్యాచులలో ఎవరేమన్నా నోరు పారేసుకుంటున్నాడు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఐదవ ఓవర్లో మన్వీంద్ర బిస్లా, షేన్ వాట్సన్ మధ్య వివాదం మొదలైంది. అది సద్దుమణిగిన మరుసటి ఓవర్ లోనే మళ్లీ ద్రవిడ్ పై గంభీర్ మాటల తూటాలు వదిలాడు. దీనిపై ఈ రోజు ఉదయం గంభీర్ వివరణ ఇచ్చాడు.
"మీరు విన్నది తప్పు. నేను, ద్రవిడ్ అన్న ఎటువంటి పరుష పదజాలం రువ్వుకోలేదు. ద్రవిడ్ ఒక గౌరవనీయమైన జట్టు సభ్యుడు. లెజండరీ బ్యాట్స్ మెన్. అతడంటే నాకు గౌరవం" అని గంభీర్ తన కోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఐపిఎల్ ఆరవ సీజన్ లోనే లోగడ గంభీర్ విరాట్ కోహ్లీ తో కూడా వాదులాట పెట్టుకున్న సంగతి తెలిసిందే.