: మద్యం దుకాణాలకు 500 మీ.ల నిబంధన నుంచి అరుణాచల్ ప్రదేశ్, అండమాన్‌లకు ఊరట!
జాతీయ రహదారులపై 500 మీ.ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదనే నిబంధన నుంచి అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. జేఎస్ ఖేహర్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అర్థం చేసుకుని ఈ తీర్పునిచ్చింది. దీంతో ఈ జాబితాలో పర్వత ప్రాంతాలైన సిక్కిం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు అండమాన్, అరుణాచల్ ప్రదేశ్‌లు కూడా చేరాయి.
అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో 80 శాతం అడవులే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగభాగం మద్యం అమ్మకాలదే. 500 మీ.ల నిబంధన వల్ల రాష్ట్రంలో ఉన్న 1011 మద్యం దుకాణాల్లో 916 దుకాణాలను తీసేయాల్సివస్తోంది. దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కోర్టుకి విన్నవించగా, సుప్రీంకోర్టు ఆ రాష్ట్రానికి 500 మీ.ల నిబంధన నుంచి విముక్తి కలిగించింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి సమస్యే ఉండటంతో ఆ ప్రాంతానికి కూడా ఊరటనిచ్చింది. తమను కూడా 500 మీ. ల నిబంధన నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్ రాష్ట్రం కోరగా, వారి వాదనకు సరైన ఆధారాలు లేకపోవడంతో వీలైనంత త్వరగా ఆధారాలు ప్రవేశ పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.