: 'అలా ఖర్చు చేయకండి...' అంటూ అభిమానులకు 'ఈగ' సుదీప్ బహిరంగ లేఖ!
శాండల్ వుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న కిచ్చ సుదీప్ అభిమానులకు బహిరంగ లేఖ రాశాడు. ఈగ సినిమాతో తెలుగులో పాప్యులర్ అయిన సుదీప్ పుట్టినరోజు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా తన అభిమానులు చేసే సందడి గురించి ఈ లేఖలో పేర్కొన్నాడు.
"ప్రతి ఏటా నా పుట్టిన వస్తుందంటే ఇంట్లో మనిషిలా అభిమానులంతా వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున నన్ను పలకరించి, శుభాకాంక్షలు చెప్పేందుకు వ్యయప్రయాసలకోర్చి ఎంతో దూరం నుంచి వస్తుంటారు. ఆ రోజు నా ఇంటి పరిసరాలన్నింటినీ అద్భుతంగా అలంకరిస్తారు. వీధుల్లో ప్రత్యేకమైన లైటింగ్ ఏర్పాటు చేస్తారు, పూలదండలతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు. అందుకు మీకందరికీ ధన్యవాదాలు.
కానీ ఒక్కసారి ఆలోచించండి.... నా పుట్టినరోజు పేరుతో పూలు, లైటింగ్ లు ఇతర కార్యక్రమాలకు అనవసరంగా ఖర్చు చేయడం అవసరమా? మీరు ఖర్చు చేసిన డబ్బుకు న్యాయం చేకూరుతుందా?... ఇలా చేయడం కంటే ఆ డబ్బును అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు, ఒక్కపూట తిండికి కూడా నోచుకోని వారికి తిండి పెట్టేందుకు వినియోగిస్తే నేను ఇంకా ఎంతో సంతోషిస్తాను. అలా కాకుండా అంతా కలిసి ఒక జీవితాన్ని కాపాడినా నాకు మీరు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు భావిస్తాను. మనం సమాజానికి చేయగలిగింది ఇదే... అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే సమాజానికి మనం చేసే సాయం. ఇకపై ఎవరూ నా పుట్టిన రోజు పేరు చెప్పి దూరం నుంచి రాకండి. అలాగే మీరు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దానిని అనవసరమైన విషయాలపై ఖర్చు చేయకండి...ఇది నా విన్నపం" అంటూ బహిరంగ లేఖ రాశాడు. ఇది అతని అభిమానులతో పాటు సినీ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది.