: ఇంటెలిజెన్స్ హెచ్చరికలను పట్టించుకుని ఉంటే ఏడుగురు బతికేవారు.. అమర్‌నాథ్ ఉగ్రదాడిపై రెండు వారాల క్రితమే హెచ్చరిక!


అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని రెండు వారాల క్రితమే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుని ఉంటే ఏడుగురు భక్తులు ప్రాణాలతో మిగిలి ఉండేవారు. సోమవారం రాత్రి అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి తర్వాత ఇంటెలిజెన్స్ హెచ్చరిక విషయం వెలుగులోకి వచ్చింది.

జూన్ 25న ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన స్టేట్ మల్టీ-ఏజెన్సీ కోఆర్డినేషన్ (ఎస్ఎంఏసీ) అధికారులు, సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసుల మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు హెచ్చరించారు.

అనంత్‌నాగ్ ఎస్ఎస్‌పీ నుంచి అందిన సమాచారం మేరకు 100-150 మంది యాత్రికులు, 100 మంది పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడి జరపాలని ఉగ్రవాదులకు ఆదేశాలు అందాయని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. యాత్ర కాన్వాయ్‌పై కాల్పులతో విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారని సమావేశంలో పేర్కొన్నారు. తద్వారా దేశంలో మత కల్లోలాలు సృష్టించాలనుకుంటున్నారని అధికారులు హెచ్చరించారు.

కాగా, ఉగ్రదాడికి గురైన యాత్రికులు అమర్‌నాథ్ ఆలయం బోర్డు వద్ద నమోదు చేసుకోలేదని సీఆర్‌పీఎఫ్ డీజీ ఆర్ఆర్ భట్నాగర్ తెలిపారు. భద్రతా దళాల సలహాను వారు పాటించలేదని, యాత్ర కాన్వాయ్‌లో కూడా వారు భాగం కాలేదని పేర్కొన్నారు. కర్ఫ్యూను సైతం ఉల్లంఘించి మరీ యాత్ర నుంచి తిరుగుపయనమైనట్టు వివరించారు. ఆర్టీసీ బస్సులకు మాత్రమే సెక్యూరిటీ ఎస్కార్ట్ ఉంటుందని, ఉగ్రదాడి జరిగిన బస్సు గుజరాత్‌కు చెందినదని వివరించారు. దీంతో అన్ని ప్రైవేటు వాహనాల్లానే దానిని కూడా పరిగణించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News