: సీన్ రివర్స్... భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన చైనా మీడియా!
భారత్ అంటేనే మండిపడుతూ వార్తలు ప్రచురించే చైనా మీడియా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడింది. భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు భారత్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఆ దేశ మీడియా అందుకు భిన్నంగా భారత్‌లో తీసుకొచ్చిన జీఎస్టీ విధానం గొప్పదని, ఆ ఘనత మోదీకే దక్కుతుందని ఈ రోజు పేర్కొంది. అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీ రంగం మెల్లగా చైనా నుంచి వెళ్లిపోతుందని, త్వరలోనే ప్రపంచ మార్కెట్లో తమ దేశం స్థానాన్ని భారత్ భర్తీ చేయగలదని పేర్కొంది.
భారత్ మెల్లిగా తన సమస్యలను అధిగమిస్తుందని తెలిపింది. భారత్‌కు ప్రస్తుతం మౌలిక వసతుల లేమి ఉందని, విధానాల అమలులో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అయినప్పటికీ భారత్ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళుతుందని పేర్కొంది. జీఎస్టీ విధానం మేకిన్ ఇండియాకు కూడా ఉపయోగపడుతుందని తెలిపింది. భారత్‌లో ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం రాష్ట్రాల మధ్య పన్ను వైరుధ్యాలను రూపుమాపుతుందని తెలిపింది. దీంతో కామన్ నేషన్ మార్కెట్ ఏర్పడి, మౌలిక రంగంలో పోటీని కూడా అధిగమించనుందని తెలిపింది.