: సెప్టెంబర్ 17 నుంచి ‘ఇంటింటికీ తెలుగుదేశం’: సీఎం చంద్రబాబు వెల్లడి
సెప్టెంబర్ 17 నుంచి 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం నియమించిన మంత్రుల కమిటీతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. రికార్డు స్థాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశామని, పదవి తీసుకున్నవారు పెదవి విప్పకపోవడం సరైన విధానం కాదని, పనితీరు, సామర్థ్యాన్ని అనుసరించి పదవి, పదోన్నతులు ఉంటాయని అన్నారు.
ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని వేస్తామని, ఆ కమిటీలో జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, కార్యదర్శి, నిర్వహణ కార్యదర్శి ఉంటారని చెప్పారు. సమస్యల పరిష్కారంలో ఉన్న వేగం.. ఫలితాల్లో కూడా కనిపించాలని, అధికారంలోకి రాగానే విద్యుత్ కొరతను అధిగమించి, మిగులు సాధించామని, సమర్థ నీటి నిర్వహణ ద్వారా కరవును దూరం చేసి పంటను కాపాడుతున్నామని అన్నారు. సమస్యలను పరిష్కరించాక, ఫలితాలు సాధించడంలో వెనకబడటం సరికాదని, అవినీతి, అక్రమాలకు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అడ్డుకట్ట వేశామని, గత ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిన వ్యవస్థలను చక్కదిద్ది గాడిలో పెట్టామని, అన్నీ సిద్ధం చేశాక పెత్తనం చేసేందుకు ప్రతిపక్షం ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు.
అన్నీ సజావుగా జరుగుతుంటే ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. మొదటి రెండేళ్లు రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీ చూసిందని, ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు, రాజధానిపై కేసులు వేశారని.. ఆ కుట్రలు ఫలించకపోవడంతో కులాలను రెచ్చగొట్టారని విమర్శించారు. అశాంతిని రేకెత్తించి, అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీకి ప్రధాన అజెండాగా ఉందని, అభివృద్ధి వ్యతిరేక పోకడలకు పాల్పడుతున్న వైసీపీ తీరును ఎండగట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నారాయణ, పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.