: అసెంబ్లీ అంటే ఓ గౌరవం.. దానికో విలువ వుంటాయి.. అక్కడ చెప్పమంటారా?: రోజా
తమ పార్టీ అధ్యక్షుడు చేసిన తొమ్మిది హామీలు టీడీపీ నేతల్లో వణుకుపుట్టిస్తున్నాయని, అందుకే విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు ఆ తొమ్మిది హామీలు ఎలా నెరవేరుతాయో క్లియర్‌గా లెక్కలతోపాటు చూపిస్తారని, అందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని రోజా సవాలు విసిరారు. అసెంబ్లీ అంటే ఓ గౌరవం, దానికో విలువ ఉంటాయని అటువంటి ప్రదేశంలో, అక్కడే తాము లెక్కలు చెబుతామని ఆమె ఉద్ఘాటించారు.
ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులు తెరచి రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్న టీడీపీ నేతలు వాటిని కప్పిపుచ్చుకోవడానికి తమపై విమర్శలు చేస్తున్నారని రోజా అన్నారు. మహిళల ప్రాణాలు, మానాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. మహిళను గౌరవించని టీడీపీ నేతలు, మహిళల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటున్నామని చెప్పుకుంటున్నారని రోజా అన్నారు. నారాయణ కాలేజ్‌లలో ఎంతో మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని రోజా విమర్శించారు.