: యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ... మోదీని ఇరుకున పెట్టే వ్యూహం పన్నిన కాంగ్రెస్!


ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా యూపీఏ తరఫున గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దించింది. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా, నేటి ఉదయం నుంచి పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశమైన 17 విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా గాంధీ పేరును నిర్ణయించాయి. మహాత్మా గాంధీ మనవడిగా, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా గోపాలకృష్ణ గాంధీ సుపరిచితులు.

గాంధీ చిన్న కుమారుడైన దేవదాస్ గాంధీ కుమారుడే గోపాలకృష్ణ గాంధీ. ఏప్రిల్ 22, 1945లో జన్మించిన ఆయన, 1968లో ఐఏఎస్ కి ఎంపికయ్యారు. ఆపై వివిధ విభాగాల్లో పదవులను అలంకరించారు. ఆయనకు భార్య తారా గాంధీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1985 నుంచి 87 మధ్య ఉపరాష్ట్రపతికి కార్యదర్శిగా, ఆపై 1992 వరకూ రాష్ట్రపతికి సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు.

కాగా, గోపాలకృష్ణ గాంధీ పేరును అధికారికంగా యూపీఏ ప్రకటించడం వెనుక, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేను ఇరుకున పెట్టాలన్న వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. గాంధీ కుటుంబంలోని వ్యక్తిని తెరపైకి తేవడం ద్వారా మోదీని ఇబ్బంది పెట్టాలన్న కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. మరోపక్క, ఎన్డీయే తరఫున సుమిత్రా మహాజన్, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, థావర్ చంద్ గెహ్లాట్ పేర్లు ఉప రాష్ట్రపతి పదవికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News