: తమిళనాట ఉత్కంఠ పెంచుతున్న రానా డైలాగ్... 'నేనే రాజు నేనే మంత్రి'కి ఫుల్ క్రేజ్!
ప్రముఖ నటుడు రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల కంటే తమిళనాడు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ‘100 మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్స్ లో కూర్చోబెడితే నేను కూడా అవుతాను సీఎం!’ అంటూ రానా చెప్పిన డైలాగ్ ఫుల్ పాప్యులర్ అయింది.
అలాగే 'ఐదేళ్లు లెక్కవేసి కొడితే సీఎం సీటు నా ముడ్డికింద ఉండాలి' అన్నడైలాగ్ కూడా తమిళనాడు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న రానాకు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా అభిమానులున్నారు. బాలీవుడ్ 'బేబీ', 'దమ్ మారో దమ్' వంటి సినిమాల్లో నటించగా, తమిళంలో 'ఆరంభం'లో అజిత్ తో కలిసి నటించాడు. దీంతో అక్కడ రానాకు మార్కెట్ ఉంది.