: జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు: జేసీ దివాకర్ రెడ్డి
నిన్న ముగిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను సీఎం అయ్యాక చేసే 9 పనులపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ ఇచ్చిన హామీలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సీఎం పీఠమెక్కాలన్నదే జగన్ ధ్యేయమని అన్నారు. అందుకోసమే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ రోజు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో తాము నియోజక వర్గాల పెంపుపై చర్చించామని దివాకర్ రెడ్డి అన్నారు. నియోజక వర్గాల పెంపుపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అలా విశాఖపట్నానికి రైల్వే జోన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు నాయుడు సూచించారని అన్నారు. ఈ సారి పార్లమెంటు సమావేశాల్లో విశాఖపట్నానికి రైల్వే జోనుపై గట్టిగా పోరాడతామని చెప్పారు.