: లోకేశ్ భవిష్యత్తు నట్టేట మునిగినట్టే!: అంబటి రాంబాబు
పార్టీ ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాల్లాంటి తొమ్మిది కార్యక్రమాలను తమ అధినేత జగన్ ప్రకటించిన తర్వాత టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ వెన్నులో చలి మొదలైందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జగన్ ప్రకటించిన కార్యక్రమాల గురించే చర్చించుకుంటున్నారని తెలిపారు. జగన్ ప్రకటనతో టీడీపీ, నారా లోకేశ్ ల భవిష్యత్తు నట్టేట మునిగినట్టేనని అన్నారు. ఇది చూసి ఓర్వలేకే జగన్ మరోసారి జైలుకు వెళతారని టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని తెలిపారు. జగన్ బయట ఉంటే చంద్రబాబుకు పుట్టగతులు ఉండవని... అందుకే ఆయనను మళ్లీ జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మద్యాన్ని నిషేధిస్తామని జగన్ ప్రకటించారని చెప్పారు. 'అవినీతి చక్రవర్తి' పుస్తకంలో తాము పేర్కొన్న ప్రతి అవినీతిని ఆధారాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధమని తెలిపారు.