: నిరుద్యోగులైన ఆసీస్ క్రికెటర్లు... పట్టువిడవని క్రికెట్ ఆస్ట్రేలియా!
ఆసీస్ క్రికెటర్లు నిరుద్యోగులైపోయారు. క్రికెట్ ఆస్ట్రేలియా నూతన వేతన చెల్లింపు విధానాన్ని ఆటగాళ్లంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. దీంతో బోర్డుతో ఒప్పందం చేసుకోలేదు. చర్చలు కొనసాగినా తమ విధానాన్ని ఎంత మాత్రం మార్చుకోలేదు. బోర్డుతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాలో ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా...దాని నుంచి గైర్హాజరవుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త వేతన చెల్లింపు విధానానికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశాడు. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లంతా ఐకమత్యంగా ఉన్నట్టు తెలిపాడు. దేశవాళీ క్రికెటర్లకు ఆర్థిక న్యాయం జరగడమే తమ అభిమతమని తెలిపాడు. క్షేత్రస్థాయి క్రికెటర్లకు మేలు చేసే నూతన చెల్లింపుల విధానాన్ని తాము డిమాండ్ చేస్తున్నామని స్టీవ్ స్మిత్ తెలిపాడు. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు నూతన చెల్లింపు విధానాన్ని ముందుకు తీసుకొచ్చామని చెబుతోంది.