: లాలూ కుమారుడి డిప్యూటీ సీఎం పదవికి చెక్.. పదవి నుంచి తొలగించే యోచనలో నితీశ్ కుమార్?
బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికారాన్ని పంచుకుంటున్న జేడీయూ, ఆర్జేడీ పార్టీల మధ్య అగాధం పెరిగిపోతోంది. ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై సీబీఐ, ఈడీ దాడులు కొనసాగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లాలూల మధ్య గ్యాప్ పెరిగింది. ఈ దాడులపై నితీశ్ కుమార్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు లాలూ నేతృత్వంలో ఆర్జేడీ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. బీహార్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మరోవైపు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రేపు భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ను పదవి నుంచి వైదొలగాలంటూ నితీశ్ కుమార్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, తనంతట తానుగా తేజశ్వీ యాదవ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందనే యోచనలో నితీశ్ ఉన్నారట. ఆయన నుంచి ప్రకటన వెలువడకపోతే... రేపు జరిగే సమావేశంలో నితీశే ఈ మేరకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
వాస్తవానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'లోక్ సంవాద్' కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఉన్నారని... అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. అయితే, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో వేదికను పంచుకోవాల్సి ఉండటం కారణంగానే... నితీశ్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.