: శ్రీవారి భక్తులపై మొదలైన జీఎస్టీ బాదుడు!
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తులపై జీఎస్టీ బాదుడు ప్రభావం మొదలైంది. రూ. 1000కి మించిన అద్దె ఉన్న కాటేజీలపై 12 నుంచి 18 శాతం అదనపు పన్నుల వసూలు ప్రారంభమైంది. ఇకపై తిరుమలలో రూ. 1000 నుంచి రూ. 2,500 అద్దె గదులపై 12 శాతం, అంతకు మించిన గదులపై 18 శాతం పన్ను భారం పడగా, కనీసం రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1,100 అదనంగా చెల్లించాల్సి వుంటుంది. తిరుమలలో గరిష్ఠ అద్దె రూ. 6 వేలు కాగా, ఇకపై దానికి రోజుకు రూ. 7,100 చెల్లించాల్సి వుంటుంది. మారిన రేట్లు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.
తిరుమలలో రూ. 50 నుంచి రూ. 6 వేల వరకూ అద్దెలపై 24 గంటల ప్రాతిపదికన గదులను టీటీడీ అందుబాటులో ఉంచగా, వీటి నుంచి దేవస్థానానికి రూ. 125 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇక తిరుమలలో టీటీడీ విక్రయించే శ్రీవారి బంగారు డాలర్లు, వివాహాది శుభకార్యాల నిమిత్తం అద్దెకు తీసుకునే కల్యాణ మండపాలపైనా జీఎస్టీ ప్రభావం పడింది. వీటి ధరలన్నీ పెరిగాయి. కాగా, తిరుమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరినప్పటికీ, ఆయన అంగీకరించలేదన్న సంగతి తెలిసిందే.