: ఆ ఐదు లక్షల ఓట్లు వచ్చుంటేనా?: జగన్ సోదరి షర్మిల
2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1.30 కోట్ల ఓట్లు వచ్చాయని, తెలుగుదేశం పార్టీకి 1.35 కోట్ల ఓట్లు వచ్చాయని గుర్తు చేసిన వైఎస్ జగన్ సోదరి షర్మిల, కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తమ పార్టీకి తగ్గాయని, ఆ ఓట్ల మెజారిటీతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, కడపలో తన అన్న జగన్ ఎంపీగా పోటీ చేస్తే, ఐదు లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తెచ్చుకున్నది కేవలం 5 లక్షల అధిక ఓట్లని, కడపలో మెజారిటీ ఉన్నన్ని ఓట్లు అదనంగా వచ్చివుంటే, ఇప్పుడు రాజన్న రాజ్యం ఉండేదని అన్నారు.
ఆ మెజారిటీ కూడా చంద్రబాబుపై విశ్వసనీయతతో రాలేదని, మోదీ కారణంగా వచ్చిందని చెప్పారు. వ్యవసాయం దండగన్న బాబు, ఎన్నికలకు ముందు ఎంత రుణమైనా మాఫీ అంటూ తప్పుడు హామీ ఇచ్చినందుకు మెజారిటీ వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడాయన నమ్మిన వారందరినీ మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, ఆపై ఆ డిమాండ్ ను గాలికొదిలి చరిత్ర హీనుడిగా మిగిలాడని నిప్పులు చెరిగారు. వైఎస్ హయాంలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారని, ఒక్క అదనపు పన్నునూ వేయలేదని, వేటి ధరలూ పెంచలేదని షర్మిల చెప్పుకొచ్చారు. 2014లో బాబు చెప్పిన అబద్ధాలు ఓట్లను తెచ్చాయని, ఇప్పుడాయన నిజ స్వరూపం ప్రతి ఒక్కరికీ తెలిసిపోయిందని అన్నారు.