: ఉగ్రవాదానికి మద్దతిస్తూ, అమెరికన్ సైన్యంలో చేరాలనుకున్న భారత సంతతి యువకుడి అరెస్ట్
ఉగ్రవాదులకు మద్దతిస్తూ, ఓ దశలో వారిలో చేరిపోవాలని భావించి, ఆపై అమెరికా సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసిన భారత సంతతి వ్యక్తి శివం పటేల్ (21)ను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించాడన్న ప్రాథమిక ఆరోపణలపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. 2011-12లో భారత్ కు మాత్రం వెళ్లి వచ్చిన తాను, గడచిన ఏడు సంవత్సరాలుగా మరే దేశానికీ వెళ్లలేదని శివం వెల్లడించగా, ఆయన చైనా, జోర్డాన్ లకు వెళ్లాడని, ఉగ్రవాదుల గురించి ఆరా తీశాడని అమెరికా నిఘా వర్గాలకు తెలిసింది.
చాలా సంవత్సరాల క్రితమే అతను ఇస్లాం మతాన్ని స్వీకరించాడని, పనిచేస్తున్న సంస్థ ఆదేశాలపై ఇంగ్లీష్ బోధించేందుకు చైనాకు వెళ్లి, ఆపై అమెరికాకు రాకుండా, జోర్డాన్ కు వెళ్లాడని, అక్కడ ఉగ్రవాదుల్లో చేరేందుకు ప్రయత్నించి అరెస్టయ్యాడని, తిరిగి అమెరికాకు వచ్చి సైన్యంలో చేరాలని ప్రయత్నించాడని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వీటిని ఇప్పుడు న్యాయస్థానం విచారిస్తోంది. పటేల్ పై ఆరోపణలు నిరూపించబడితే, ఐదేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.