: విమానం గాల్లో ఉండగా డోర్ తీయబోయిన ప్రయాణికుడు.. వైన్ బాటిల్సే తో కంట్రోల్ చేసిన సిబ్బంది!
డెల్టా ఎయిర్ లైన్స్ విమానమెక్కిన ఓ వ్యక్తి, విమానం గాల్లో ఉండగా, డోర్లు తెరిచేందుకు ప్రయత్నించగా, క్యాబిన్ క్రూ వైన్ బాటిల్స్ నే ఆయుధాలుగా మార్చి అతడిని కట్టడి చేశారు. ఎఫ్బీఐ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సియాటెల్ నుంచి బీజింగ్ వెళుతున్న విమానంలో జోసెఫ్ హుడెక్ అనే వ్యక్తి హల్ చల్ చేశాడు. టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 200 మందికి పైగా ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. 23 ఏళ్ల జోసెఫ్, డెల్టా ఎయిర్ వేస్ లో పనిచేసే ఉద్యోగుల బంధువులకు ఇచ్చే డిపెండెంట్ పాస్ తో విమానం ఎక్కాడు. టేకాఫ్ కు ముందే బీరును ఆర్డర్ చేశాడు.
ఓ గంట ప్రయాణం తరువాత తన సీటు నుంచి లేచి వచ్చి బాత్ రూముకు వెళ్లిన హుడెక్, ఆపై కుడివైపున్న ఫార్వార్డ్ ఎగ్జిట్ డోర్ ను తెరిచే ప్రయత్నం చేశాడు. దాన్ని చూసిన క్యాబిన్ క్రూ వెంటనే స్పందించింది. అతన్ని అదుపు చేసేందుకు సాయం చేయాలని కేకలు వేస్తూ, వైన్ సీసాలను అతనిపై విసిరేశారు. తనను పట్టుకునేందుకు వచ్చిన వారిపై హుడెక్ దాడి కూడా చేశాడు. డోర్ లివర్ ను సగం తీశాడు కూడా. ఓ వైన్ బాటిల్ ను బలంగా హుడెక్ తలపై కొట్టిన తరువాతనే అతన్ని బంధించగలిగారు. అప్పటికే విషయాన్ని ఏటీసీ అధికారులకు వెల్లడించిన పైలట్, సియాటెల్ కు వెనక్కు మళ్లించేందుకు అనుమతి కోరాడు. ఇక విమానం దిగిన తరువాత, హుడెక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆ విమానం దాడి జరిగిన హోటల్ లా కనిపించిందని, పలు ప్లేట్లు, ఆహారం, గాజు సీసాలు పగిలిపోయి కనిపించాయని ఎఫ్బీఐ తన చార్జ్ షీట్ లో పేర్కొంది.