: వైసీపీ ప్లీనరీ ప్రాంగణంలోని స్పెషాలిటీస్!
గుంటూరు-విజయవాడ హైవేపై నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఉన్న మైదానంలో వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. ఈ ప్లీనరీకి ఏర్పాట్లు భారీగా చేశారు. ప్లీనరీలోని వేదికను జర్మనీ టెక్నాలజీతో నిర్మించారు. వేదిక ఎదుట పదివేల మందికి పైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. నేతలకు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వర్షం పడినా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
ప్లీనరీకి తరలి వస్తున్న నేతలు, కార్యకర్తలను ఆకట్టుకునేలా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు, పల్నాటి బ్రహ్మనాయుడు, వంగవీటి మోహనరంగా, కూచిపూడి నృత్యకారులతో పాటు పలువురు నేతల పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద వైయస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని ఉంచారు. అంతే కాకుండా వేదిక ముందు అనేక వైయస్ విగ్రహాలను ఉంచారు. జగన్ కు స్వాగతం పలుకుతూ పలు ఫ్లెక్సీలను కట్టారు.
నాయకులకు, కార్యకర్తలకు వేర్వేరుగా భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలతో కలసి కూర్చొని జగన్ భోజనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. సుమారు 5 వేల మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాటు చేశారు.