: వందరోజుల్లో నిర్మిస్తాం లేదా 5 కోట్ల డాలర్ల నష్టం భరిస్తాం: టెస్లా సంచలన నిర్ణయం
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీని కేవలం వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని టెస్లా కంపెనీ ముందుకు వచ్చింది. దక్షిణ ఆస్ట్రేలియాలో విపరీతమైన గాలులు (టోర్నడో) విద్యుత్ సరఫరాకు తీవ్రమైన ఆటంకం కలిగిస్తున్నాయి. ఇక్కడ థర్మో, విండ్, సోలార్ విద్యుత్ కేంద్రాలున్నాయి. అయితే విద్యుత్ ను నిల్వచేసుకునే సామర్థ్యం సమర్ధవంతంగా లేకపోవడం వల్ల ఇక్కడ ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ బ్యాటరీ ఏర్పాటు చేయాలని భావించింది. దీంతో 100 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ నిర్మించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. వివిధ సంస్థలు ముందుకు వచ్చినా టెస్లా ఈ టెండర్ ను దక్కించుకుంది.
పునరుత్పాదక ఇంధన రంగంలో అతిపెద్ద ప్రయోగంగా పేర్కొంటున్న ఈ బ్యాటరీ ఏర్పాటుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టెస్లా ఈ సంస్థ ఏర్పాటుపై మాట్లాడుతూ, దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఈ భారీ లిథియం-అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. కాంట్రాక్టు ఒప్పందాలన్నీ పూర్తయిన 100 రోజుల్లోగా ఈ వంద మెగావాట్ల బ్యాటరీని సిద్ధం చేస్తామని తెలిపింది. లేని పక్షంలో ఈ బ్యాటరీ నిర్మాణానికి అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపింది. గడువులోగా నిర్మాణం పూర్తికాని పక్షంలో తమ సంస్థపై 5 కోట్ల డాలర్ల మేర భారం పడుతుందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తెలిపారు.
ఈ బ్యాటరీతో ఒకేసారి 30,000 ఇళ్లలో విద్యుత్ వెలుగులు పూయించవచ్చని టెస్లా తెలిపింది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన నియోయెన్ సంస్థ నిర్మిస్తున్న పవన విద్యుత్ కేంద్రంలో భాగంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. అయితే గతంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన 80 మెగావాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్రాజెక్టు కంటే ఇది పెద్దది కావడంతో ప్రపంచంలోనే భారీ బ్యాటరీగా గుర్తింపు పొందనుంది.