: ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు కొల్లగొడుతున్న భారత క్రీడాకారులు!
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న 22వ ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు శుక్రవారం రెండో రోజు నాలుగు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి పట్టికలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారు. 400 మీటర్ల మహిళల పరుగులో హరియాణాకు చెందిన నిర్మల షియోరన్ స్వర్ణం గెలుచుకోగా, ఆ వెంటనే 400 మీటర్ల పురుషుల విభాగంలో ముహమ్మద్ అనాస్ ‘బంగారం’ సాధించాడు. అదే విభాగాల్లో రాజీవ్ అరోకియా, జిస్నా మాథ్యూలు రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. అలాగే 1500 మీటర్ల మహిళల రేసులో పీయూ చిత్ర, పురుషుల విభాగంలో అజయ్ కుమార్ స్వర్ణాలు సాధించారు.
ఈ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాలు సాధించిన వారు లండన్‌లో వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు అర్హులవుతారు. కాగా, తాజా చాంపియన్‌షిప్స్‌లో రెండో రోజు పూర్తయ్యే సరికి భారత్ మొత్తం 15 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ అథ్లెట్లు గెలుచుకున్న పతకాల్లో ఆరు స్వర్ణాలు, మూడు రజత, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. 4 స్వర్ణాలు, 3 రజత, 2 కాంస్యాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది.