: భారత్‌కు ఆయుధాల విక్రయంపై పాక్ ఆందోళన.. ప్రాంతీయ సమతౌల్యత దెబ్బతింటుందని ఆందోళన
భారత్‌కు ఆయుధాలు విక్రయించడమంటే ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక సమతౌల్యతను దెబ్బతీయడమేనని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆందోళనను అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తామని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారిక ప్రతినిధి నఫీస్ జకారియా పేర్కొన్నారు. దక్షిణాసియా ప్రాంతంపై తమ చర్యలను, విధానాలను నిష్పక్షపాతంగా అంచనా వేయడానికి పాకిస్థాన్ తన గళాన్ని వినిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌కు ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్ల విక్రయానికి సంబంధించి అమెరికా అన్ని అనుమతులు పూర్తిచేసినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో హక్కానీ నెట్ వర్క్ విస్తరించి ఉందన్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. పాక్‌పై నిందలు మోపేందుకు హక్కానీ నెట్‌వర్క్ పేరును చక్కగా ఉపయోగించుకుంటున్నారని నఫీస్ విమర్శించారు. హక్కానీ నెట్‌వర్క్ కమాండర్లు ఆఫ్ఘనిస్థాన్‌లో హతమవుతుండడాన్ని చూస్తే అది ఆఫ్ఘాన్‌లో ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. పాకిస్థాన్ నుంచి హక్కానీ నెట్‌వర్క్ నడవడం లేదన్న విషయం తేటతెల్లమవుతుందని తేల్చి చెప్పారు. తమ దేశంలో తాలిబన్, జమాత్-ఉల్ అహర్, ఐఎస్, ఆల్‌ఖాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు లేవని మరోమారు స్పష్టం చేశారు.