: చంద్రబాబు మా సభకు ఎందుకు అనుమతివ్వలేదు?: మంద కృష్ణ మాదిగ మండిపాటు
ఏపీలో నిర్వహించాలనుకున్న కురుక్షేత్ర సభను కావాలనే సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఏపీలోని ఓ రహస్య ప్రదేశం నుంచి మంద కృష్ణ తమతో మాట్లాడినట్టు ఓ న్యూస్ ఛానెల్ పేర్కొంది. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా అనేక సభలకు అనుమతిచ్చిన చంద్రబాబు, తాము నిర్వహించాలనుకున్న కురుక్షేత్ర సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని మంద కృష్ణ ప్రశ్నించారు.
తమ ఉద్యమం ఎప్పుడూ హింసాత్మక మార్గం వైపు వెళ్లలేదని, ప్రజల చేత మద్యం తాగించే ఎక్సైజ్ శాఖ మాదిగలకు వద్దని, ఆ శాఖా మంత్రి జవహర్ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు చంద్రబాబుపై రాళ్లు రువ్విన జూపూడి ప్రభాకర్ కు ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చారని, చంద్రబాబుపై విమర్శలు చేసిన కారెం శివాజీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని విమర్శించారు. కురుక్షేత్ర సభకు వస్తున్న తమ కార్యకర్తలను అడ్డుకోవడం అన్యాయమని మంద కృష్ణ మండిపడ్డారు.