: తనను హాస్టల్ లో వుంచడం ఇష్టంలేక... తండ్రిని నరికిన ఆరవ తరగతి బాలుడు!
ఆ బాలుడికి ఇంట్లోనే ఉండి ఆడుతూ పాడుతూ చదువు కొనసాగించాలని ఉంది. అయితే, ఇంట్లో ఉండి చదువుకుంటే సరిగా చదువుపై దృష్టిపెట్టలేడని అతడి తండ్రి బలవంతంగా ఆ బాలుడిని హాస్టల్లో చేర్పించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న ఆ బాలుడు ఈ రోజు ఆయనపై కొడవలితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువులో చోటు చేసుకుంది.
ఈ రోజు తన ఇంటికి వచ్చిన ఆ బాలుడు కొడవలి తీసుకుని తన తండ్రిని నరికాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ పిల్లాడిని అడ్డుకుని బాధితుడిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తండ్రి పేరు నాగన్న అని, ఆరవ తరగతి చదువుతున్న అతడి కుమారుడు కార్తీక్ ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.