: ఫ్లాష్ బ్యాక్: దివ్య భారతి స్థానంలో జుహీ చావ్లా... కారణం ఆమిర్ ఖాన్!
చిన్నవయసులో చనిపోయిన నటి దివ్యభారతి 1990-93 మధ్యకాలంలో బాలీవుడ్ అగ్రనటులందరితోనూ నటించింది. ఒక్క ఆమిర్ ఖాన్‌తో తప్ప. యశ్‌రాజ్ ఫిలింస్ వారి `డర్` సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. కానీ దివ్యభారతి స్థానంలో జూహీ చావ్లాను తీసుకోవాలని ఆమిర్ ఆంక్ష విధించాడట. ఇందుకు వారిద్దరి మధ్య 1992 మార్చిలో జరిగిన గొడవే కారణమని ముంబైలోని సినిమా మేగజైన్ రాసింది.
లండన్‌లో జరిగిన ఓ వేడుకలో ఆమిర్, దివ్య రిహార్సల్ చేస్తుండగా ఆమె కొన్ని స్టెప్పులు మర్చిపోవడం ఆమిర్‌కు నచ్చలేదు. దీంతో వేడుకలో జూహీ చావ్లాతో కలిసి ఆమిర్ డ్యాన్స్ వేశారు. తర్వాత ఒంటరిగా స్టేజీ మీద ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న దివ్యకు సల్మాన్ సాయం చేశాడు. ఈ విషయాలన్నీ వేడుక తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో దివ్య చెప్పింది. ఆమిర్ సీనియర్ అయితే తప్పులు సరిచేయాలి కానీ ఇలా చేస్తారా? అని తిడుతూ, సల్మాన్ వ్యక్తిత్వం చాలా గొప్పది అంటూ ఇంటర్వ్యూలో చురకలు వేసింది దివ్య.
దీంతో ముందు దివ్యభారతి హీరోయిన్గా, సన్నీ డియోల్, ఆమీర్ హీరోలుగా అనుకున్న `డర్` సినిమా కాస్తా ఆమిర్ సలహాతో జూహీ చావ్లాను తీసుకున్నారని దివ్యభారతి తల్లి మరో ఇంటర్వ్యూలో వివరించారు. అయితే, ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఆమీర్ ను తొలగించి ఆ స్థానంలో షారుఖ్ ఖాన్ ను తీసుకోవడం మరో విశేషం.