: ఎంపీ సాక్షిగా కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిల మధ్య వాగ్వాదం!
తెలంగాణలోని జనగామ జిల్లాలో ఇటీవల సీడ్ బాల్స్ బాంబింగ్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి తనను ఎందుకు పిలవలేదంటూ జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిలదీశారు. దీనికి సమాధానంగా, తాను ఐదు సార్లు ఫోన్ చేశానని, మీరే ఫోన్ తీయలేదని కలెక్టర్ చెప్పారు. దీంతో, కాల్ లిస్ట్ చూపించాలంటూ కలెక్టర్ ను ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో 'కలెక్టర్ ను, నన్నే అడుగుతారా?' అంటూ కాల్ లిస్ట్ చూపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది సాక్షాత్తు ఎంపీ బూర నర్సయ్య సమక్షంలో జరిగింది. దీంతో ఆయన కల్పించుకుని ఇద్దరికీ నచ్చజెప్పి, అక్కడ నుంచి కదిలించారు. ఈ విషయం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం అయింది. జనగామ పట్టణ శివార్లలోని చంపక్ హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద నిన్న బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.