: చైనాకు భారత్ దీటైన సమాధానం... డోక్లాం నుంచి సైన్యాన్ని ఉపసంహరించేది కలే!
సిక్కిం సమీపంలోని భారత్, చైనా సరిహద్దుల మధ్య డోక్లాం ప్రాంతంలో ఇరు దేశాల బలగాలూ మోహరించి, యుద్ధ వాతావరణం ఏర్పడిన వేళ, చైనా ఎంతగా హెచ్చరిస్తున్నా వెనుకంజ వేయరాదని భారత్ భావిస్తోంది. డోక్లాం నుంచి వెంటనే బేషరతుగా సైన్యాన్ని ఉపసంహరించాలని, ఆ తరువాతే సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతామని చైనా హెచ్చరించినా, వెనక్కు తగ్గేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. భారత్, భూటాన్, టిబెట్ ప్రాంతాలకు ట్రై జంక్షన్ గా ఉన్న డోక్లాం, తమదేనని వాదిస్తున్న భారత్, అక్కడ మోహరించిన సైనిక బలగాలను వెనక్కు తీసుకునేందుకు ససేమిరా అంటోంది.
ఇక్కడి నుంచి ప్రవహిస్తూ, బ్రహ్మపుత్రలో కలిసే జల్ ధాకా, తోర్షా నదులపై హైడల్ ప్రాజెక్టులను, వాటిని కలిపేందుకు రహదారులను చైనా నిర్మించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం తమదేనని కూడా ఆ దేశం వాదిస్తోంది. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతున్న ఇండియా, అక్కడ జరుపుతున్న రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. భూటాన్ సైతం ఇండియాకే మద్దతుగా నిలువగా, చైనా భారీ ఎత్తున సైన్యాన్ని అక్కడికి పంపి, యుద్ధ విన్యాసాలు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు హాంబర్గ్ వెళ్లిన భారత్, చైనా దేశాధినేతలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని నిర్ణయించుకున్నారు.
ఇదిలావుండగా, సిక్కిం సెక్టారులో భారత్, చైనాలు సుమారు 200 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో సరిహద్దు రేఖ స్పష్టంగా లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని భారత్ చెబుతోంది. నేతల సమక్షంలో 2012లో భారత్, చైనా మధ్య కుదిరిన 'ట్రై జంక్షన్ పాయింట్స్' ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తోందని, అది దేశ సార్వభౌమత్వానికి విఘాతమని, అటువంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని భారత్ స్పష్టం చేసింది.