: నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ: నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్‌మన్
నల్లడబ్బును, అవినీతిని పారద్రోలడానికి నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్‌మన్ అన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ నుంచి తాను చాలా ఆశించానని, నోట్ల రద్దు నిర్ణయంతో ఆయనపై నమ్మకం పోయిందని పాల్ వాపోయారు. ఇటీవల భారత ఆర్థిక రంగ పరిణామాలపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
`నోట్ల రద్దు విషయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నేనైతే దానికి ఒప్పుకుని ఉండే వాణ్ని కాదు. అవినీతి అనే పెద్ద చెట్టును కూల్చడానికి నోట్ల రద్దు అనే మొండి కత్తిని ఉపయోగించడం అవివేకం. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరుగుతుంది. అదృష్టవశాత్తు నేను ఊహించినంత నష్టం జరగలేదు` అని పాల్ అన్నారు. అలాగే జీఎస్టీ అంశంపై కూడా ఆయన తన స్పందన తెలియజేశారు. నోట్ల రద్దుతో పోల్చినపుడు జీఎస్టీ అమలు ఒక శుభపరిణామమని పాల్ క్రూగ్‌మన్ వివరించారు.