: 21 ఏళ్లలో అత్యుత్తమ ఫిఫా ర్యాంక్ సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టు
రెండు దశాబ్దాల తర్వాత ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 96వ స్థానం సంపాదించింది. ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంక్‌గా 1996లో సాధించిన 94వ స్థానం నిలిచింది. సరిగ్గా 21 ఏళ్లకు మళ్లీ అత్యుత్తమ ర్యాంక్ చేరువలోకి భారత జట్టు చేరుకుంది. భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటీన్ పునరాగమనంతో గడచిన రెండేళ్లలో మంచి ర్యాంకింగ్స్ సాధ్యమవుతున్నాయి.
`2015లో నేను కోచ్ బాధ్యతలు చేపట్టినపుడు ఎలాగైనా భారత జట్టు ర్యాంక్‌ను 100 లోపు తీసుకురావాలనుకున్నా. ఈరోజు అది సాధ్యమైంది` అంటూ ఆనందం వ్యక్తం చేశారు స్టీఫెన్. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్లకు, సిబ్బందికి, ఈ విజయం సాధించడంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ర్యాంక్‌తో సంబరపడి పోకుండా ఇంకా మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కష్టపడతామని స్టీఫెన్ చెప్పారు. గతేడాది జరిగిన 14 అంతర్జాతీయ మ్యాచుల్లో భారత జట్టు 12 గెలవడంతో ఈ ర్యాంక్ సాధ్యమైంది. దీంతో ఫిఫా ఆసియా ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 12కు చేరుకుంది.