: ‘మేము జోక్యం చేసుకోలేం’... ఎమ్మెల్యే రోజా పిటిషన్ పై సుప్రీంకోర్టు
దురుసు ప్రవర్తన కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతో దానిని సవాల్ చేస్తూ, ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసు హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎమ్మెల్యే రోజా ఇప్పటికే క్షమాపణ చెప్పారని, అందుకు సంబంధించిన ఓ లేఖను కూడా రాశారని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
అయితే, ఆ లేఖ ఏపీ సర్కారుకి అందలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి ఈ రోజు న్యాయస్థానం సమక్షంలో రోజా రాసిన క్షమాపణ లేఖను అందజేశారు. ఆ లేఖను ఏపీ ప్రభుత్వ సంబంధిత శాఖలకు పంపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది కాబట్టి, ఆ కోర్టులో కేసు ముగిసిన అనంతరమే తాము విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.