: చైనా మరో దుస్సాహసం.. సిక్కింను భారత్ నుంచి విడగొడతామంటూ ప్రేలాపన!


సరిహద్దు వద్ద భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇరు పక్షాలు కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఉన్న వేళ... ఇండియాకు చైనా మరో వార్నింగ్ ఇచ్చింది. భారత్ వెనక్కి తగ్గకపోతే సిక్కిం వేర్పాటువాదులకు తాము మద్దతు ప్రకటిస్తామని, సహాయ సహకారాలను అందజేస్తామని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్న సిక్కిం ప్రజలకు మద్దతు ఇవ్వడమనే అంశాన్ని బలమైన ఆయుధంగా భావిస్తున్నట్టు కథనంలో పేర్కొంది. ప్రాంతీయంగా ఆధిపత్యం వహించాలనుకుంటున్న న్యూఢిల్లీకి చెక్ పెట్టాలనేదే చైనా భావన అని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే, సిక్కిం వేర్పాటువాదాన్ని చైనా మరోసారి తెరపైకి తెస్తుందని చెప్పింది. తమ భూభాగంలోకి చొరబడుతున్న భారత్ అంతకంతా చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 2003లో సిక్కింను భారత భూభాగంగా చైనా గుర్తించినప్పటికీ... అవసరమైతే ఇప్పుడు ఆ అంశాన్ని సవరిస్తామని తెలిపింది. సిక్కింలో వేర్పాటువాదాన్ని రాజేస్తామని చెప్పింది.

1960, 1970 దశకాలలో సిక్కింల తిరుగుబాటును భారత ప్రభుత్వం ఉక్కుపాదంలో అణచి వేసిందని ఆరోపించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంలోకి భూటన్ ను కూడా ఇండియా లాగుతోందని విమర్శించింది. భూటాన్ పై ఇండియా ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో... ఆ దేశానికి చైనా సహా ఇతర పొరుగుదేశాలు, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు లేకుండా పోయాయని తెలిపింది. భూటాన్ సార్వభౌమాధికారం, దేశ రక్షణ వ్యవహారాలను భారత్ నియంత్రిస్తోందని పేర్కొంది.

  • Loading...

More Telugu News