: హైఫా సమాధి స్థలాన్ని సందర్శించనున్న మోదీ
తన మూడు రోజుల ఇజ్రాయెల్ దేశ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇవాళ హైఫా సమాధి స్థలాన్ని సందర్శించనున్నారు. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన భారత సైనికులకు ఆయన నివాళి అర్పించనున్నారు. ఇజ్రాయెల్ ఓడరేవు పట్టణం హైఫాకు స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రాణాలర్పించిన సైనికులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోనున్నారు. అలాగే యుద్ధంలో జోధ్‌పూర్ లాన్సర్ల దళాన్ని నడిపించిన మేజర్ దల్పత్ సింగ్ షెకావత్ జ్ఞాపకార్థం ఓ ఫలకాన్ని కూడా విడుదల చేయనున్నారు. 1918 సెప్టెంబర్‌లో జోధ్‌పూర్, మైసూర్, హైదరాబాద్ లాన్సర్ దళాలు కలిసి హైఫా స్వాతంత్ర్యం కోసం పోరాడాయి. ఈ పోరాటానికి గుర్తుగా భారత ఆర్మీ ప్రతి ఏడాది సెప్టెంబర్ 23ను హైఫా దినంగా స్మరించుకుంటోంది.