: నోట్ల రద్దు, జీఎస్టీ అయిపోయాయి.. మోదీ నెక్స్ట్ టార్గెట్ ఇదే!
పెద్ద నోట్లను రద్దు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాని మోదీ... ఆ తర్వాత 'ఒక దేశం ఒకే పన్ను' అంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు మరో కీలక అంశంపై ఆయన దృష్టిని సారించారు. తాజాగా మోదీ దృష్టి సారించిన అంశంతో రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది. రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడమే ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యల వల్ల మొత్తం రాజకీయ విరాళాల వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని చెప్పారు. పార్టీల విరాళాల అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ చెబుతున్నారని జైట్లీ అన్నారు. రాజకీయ పార్టీలు విరాళాలను నగదు రూపంలో కాకుండా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకోవాలంటూ ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో జైట్లీ తెలిపిన సంగతి తెలిసిందే.