: ఒక్క చెక్కుతో కదిలిన కేంద్రం... రైల్వే రాయితీపైనా 'గివ్ అప్' పథకం!
ఇటీవల ఫరీదాబాద్ కు చెందిన అవతార్ కృష్ణ అనే వ్యక్తి, తనకు రైల్వే టికెట్ లో రాయితీ వద్దని చెబుతూ రూ. 950 చెక్కును రైల్వే అధికారులకు పంపిన సంగతి గుర్తుందా? ఈ లేఖను అందుకున్న తరువాత అధికారులు రైల్వే మంత్రితో చర్చించి కొత్త నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వంట గ్యాస్ రాయితీ వద్దని భావించిన వారికి 'గివ్ అప్' పథకాన్ని ప్రకటించినట్టుగానే, రైళ్లలోనూ రాయితీలు వద్దనుకునే వారి నుంచి పూర్తి మొత్తం వసూలు చేసేలా 'గివ్ అప్' పథకం రానుంది.
రైల్వే మంత్రి సురేష్ ప్రభు త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారని, విధి విధానాలు సాధ్యమైనంత త్వరలో ఖరారు చేసి ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. గ్యాస్ సబ్సిడీలో మాదిరిగానే ఇక్కడా అదే పథకం అమలవుతుందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం రైల్వే టికెట్లపై పలు వర్గాల ప్రజలకు భారీ రాయితీలు అందుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్, దివ్యాంగులు, మీడియా, రైల్వే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు... ఇలా ఎంతో మంది నిత్యమూ రైళ్లలో రాయితీలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. రాయితీలు పొందిన టికెట్ పై ఏ మేరకు రాయితీ పొందారన్న విషయం కూడా ముద్రితమవుతుందన్న సంగతి తెలిసిందే.